Danny Notes
8-8-2015
చలసాని స్వర్గం!
ఉషాయస్ డానీ
శ్రీశ్రీకి చలసాని ప్రసాద్ సాహిత్య భార్య
అని బయటి ప్రపంచంలో అందరికీ తెలుసు. కొండపల్లి సీతారామయ్యకు చలసాని రాజకీయ భార్య
అని లోపలి ప్రపంచానికి మాత్రమే తెలుసు.
విప్లవ రచయితల సంఘం నాలుగు స్థంభాల్లో వరవరరావు, త్రిపురనేని
మధుసూదనరావు నక్సల్బరీ తరానికి చెందిన వారైతే, కేవీ రమణా రెడ్డి, చలసాని ప్రసాద్ ఉమ్మడి
కమ్యూనిస్టు పార్టి తరం నుండి కొనసాగిన వాళ్ళు. అప్పటి నుండి నేటి మావోయిస్టుల వరకు దాదాపు ఎనిమిది
దశాబ్దాల కమ్యూనిస్టు చరిత్రకు చలసాని ప్రత్యక్ష సాక్షి. సాక్షి అంటే పక్కన నిలబడి
చూసేవాడు అనే అర్ధం మాత్రమే వుంటే చలసాని సాక్షికాదు; పాత్రధారి. కొన్ని సందర్భాల్లో
సూత్రధారి కూడా.
ఆంధ్రా పర్యటనకు వస్తున్న చారు మజుందార్ ను గుత్తికొండ బిలంలో
కలవాల్సినవాళ్ళ జాబితాను నిర్ణయించింది అప్పటి కాజీపేట రైల్వే కాలనీలోని చలసాని ప్రసాద్
గదిలోనే. పీపుల్స్ వార్ కు మాతృక అయిన సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ (సీవోసి) ఆ విర్భవించింది
కూడా ఆ గదిలోనే. సగర్వంగా చెప్పుకోవాల్సిన వాస్తవాన్నీ టెక్ జాగ్రత్తలవల్ల చలసాని చెప్పుకోలేదుగానీ అతని పెద్ద కుమార్తె మమత ప్రస్తుతం రహాస్యోద్యమంలో కీలక బధ్యతల్ని నిర్వహిస్తోంది.
ఏడెనిమిది దశాబ్దాలు ఒక ఆలోచనకు కట్టుబడి కొనసాగడం ఏ విధంగానూ
చిన్న విషయంకాదు. అంచేత చలసాని ప్రసాద్ ను అంచనా వేయడానికి సాహిత్య పరికరాలో, రాజకీయ
పరికరాలో, కుటుంబ పరికరాలో సరిపోవు. అంతకు మించిన ఒక సమగ్ర పరికరాన్ని కనిపెట్టాలి.
ఇప్పుడు నాకు అలాంటి పరికరం అందుబాటులో లేదుకనుక చలసానితో కేవలం నా వ్యక్తిగత అనుబంధాన్ని పంచుకోవడానికే పరిమితమౌతాను.
చలసాని ప్రసాద్ చివరి కార్యక్షేత్రం విశాఖపట్నమే అయినా ఆయన
మూలాలు కృష్ణాజిల్లాలో వున్నాయి. 1978 చివర్లోనో, 1979 మొదట్లోనో చలసాని నాకు పరిచయమయ్యాడు.
అప్పట్లో నేను కృష్ణా, వుభయ గోదావరి జిల్లాల
పీపుల్స్ వార్ యువజన విభాగం బాధ్యుడిగా వుండడంతో మా మధ్య అనుబంధం కొనసాగింది. నేను
విరసంలో చేరాక “ఏరా డ్యానీగా!” అన్నంత చనువూ ఏర్పడింది.
మా ఇద్దరికీ నీళ్ళంటే పిచ్చి. తను హంసలదీవిలో కృష్ణనది ఒడ్డున
పుట్టాడు. నేను నరసాపురంలో గోదావరి వొడ్డున పుట్టాను. నీళ్ళు కనపడితే చాలు మేమిద్దరం
బట్టలు విప్పేసి దూకేసేవాళ్ళం. మా ఇద్దరికీ ఇంకో కామన్ ఇంట్రెస్టు అల్లూరి శ్రీరామరాజు.
అల్లూరి చదివిన నరసాపురం టేలర్ స్కూలులో నేను ఎలిమెంటరీ విద్య చదివాను. అల్లూరి ఇంటర్
చదివిన ఏవీఎన్ కాలేజీలో చలసాని లెక్చరర్ గా
పనిచేశాడు.
మార్క్సిస్టు తత్వశాస్త్రంలో మెళుకువల్ని నేను త్రిపురనేని
మధుసూదనరావు దగ్గర నేర్చుకున్నాను. అంతకు ముందే నాకు, చీరాలలో మూడు రోజులపాటు గతితార్కిక భౌతికవాదం పాఠం చెప్పినవాడు చలసాని. తత్వశాస్త్రాన్ని బోధించడంలో చలసానిది కొండపల్లి
శైలి. నిరక్షరాశ్యులకు కూడా వాళ్ళు తత్వశాస్త్రం బోధించగలరు. రాడికల్ యూత్ లీగ్ ఖమ్మం
మహాసభల్లో కేఎస్ చారిత్రాత్మక ఉపన్యాసం విన్న అదృష్టవంతుల్లో నేనూ ఒకడ్ని. నా గురువు
త్రిపురనేనిది నారికేళపాకం శైలి. నేను పట్టణాల్లో విద్యాధికులకు తత్వశాస్త్రం పాఠం చెప్పే సందర్భాల్లో త్రిపురనేని
శైలీనీ, గ్రామాల్లోనో, అడవిలోనో పాఠాలు చెప్పేటప్పుడు
కొండపల్లి-చలసాని శైలిని అనుసరించేవాడిని. గొప్పవాళ్ళతో సాహచర్యంవల్ల ప్రయోజనం ఇదే.
మనం జ్ఞానులుగా కొనసాగడానికి వినికిడి జ్ఞానమే సరిపోతుంది.